Telangana: తెలంగాణ పోలీసుల చేతికి మరో అస్త్రం.. పోలీస్ జీపీటీతో దర్యాప్తు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పోలీసుల దర్యాప్తులో మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే టెక్నాలజీ వినియోగంలో ముందున్న రాష్ట్ర పోలీస్‌శాఖ తాజాగా 'పోలీస్ జీపీటీ'ని తీసుకొచ్చింది. పూర్తి పేరు 'పోలీస్ జీపీటీ - ఆఫ్‌లైన్ ఏఐ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్'. సాధారణంగా చాట్‌జీపీటీ గురించి చాలామందికి తెలుసు. అయితే పోలీస్ జీపీటీ ప్రత్యేకత ఏమిటి?నేర పరిశోధనలో ఇది పోలీసులకు ఎలా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి.
వివరాలు
'ఆస్క్ ఏ క్వశ్చన్.. రీడ్ ఏ డాక్యుమెంట్.. చెక్ ది సోర్స్'
దర్యాప్తు అధికారులకు అవసరమైన సమాచారం, సూచనలు అందిస్తూ నేర పరిశోధనలో మార్గదర్శిగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశం.
సమాచారం కచ్చితత్వం, ప్రామాణికతకు ప్రాధాన్యమిస్తూ క్షేత్రస్థాయి పోలీసులకు ఇది సహాయపడనుంది.
నేరం జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం నుంచి దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే వరకు ప్రతి దశలోనూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుంది.
'ఆస్క్ ఏ క్వశ్చన్.. రీడ్ ఏ డాక్యుమెంట్.. చెక్ ది సోర్స్' (ప్రశ్న అడగండి.. పత్రాన్ని చదవండి.. ఆధారాన్ని పరిశీలించండి) అనేది దీని నినాదం.
పోలీస్‌శాఖలో మరో కీలక సాంకేతిక పరిజ్ఞానంగా అధికారులు దీన్ని భావిస్తున్నారు.
వివరాలు
ఆ లోపాన్ని అధిగమించేందుకు...
ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత సంభాషణాత్మక వ్యవస్థ చాట్‌జీపీటీ.
వినియోగదారులు సహజ భాషలో అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని, మనిషి మాట్లాడినట్లుగా సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత.
ఇదే తరహాలో తెలంగాణ పోలీస్‌శాఖ అంతర్గత అవసరాల కోసం ప్రత్యేకంగా పోలీస్ జీపీటీని రూపొందించింది.
సాధారణ చాట్‌జీపీటీ వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం అంతర్జాలంలోని సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
అయితే అక్కడ తప్పుడు సమాచారం ఉంటే.. దానినే సమాధానంగా ఇచ్చే అవకాశం ఉంది.
ఈ సమస్యను అధిగమించేందుకే పోలీస్ జీపీటీని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నేర పరిశోధనలో ఎలాంటి గందరగోళం లేకుండా, ప్రామాణికమైన సమాచారం మాత్రమే అందించడంపై దృష్టి పెట్టారు.
వివరాలు
ఆ లోపాన్ని అధిగమించేందుకు...
క్షేత్రస్థాయిలో దర్యాప్తులో కీలక పాత్ర పోషించే స్టేషన్ రైటర్లు,కానిస్టేబుళ్లు,ఎస్సైలు, సీఐలు కూడా దీన్ని సులభంగా వినియోగించుకునేలా రూపొందించారు.
ప్రస్తుత అవసరాలను గుర్తించిన డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రాజెక్టు బాధ్యతలను టీజీ స్పార్క్‌కు అప్పగించారు.
పోలీస్ జీపీటీకి పోలీసింగ్ మాన్యువల్, ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌వోపీలు), పోలీస్‌శాఖ అంతర్గత సర్క్యులర్లు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందించారు.
దీంతో దర్యాప్తు అధికారులకు అవసరమైన వివరాలను ఈ నిర్దిష్ట సమాచార నిధి నుంచే అందించేలా వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ఈ విధానం వల్ల అంతర్గత పోలీస్‌శాఖ సమాచారం బయటకు వెళ్లకుండా భద్రత కల్పించే అవకాశం ఉంటుంది.
వివరాలు
శిక్షల శాతం పెరిగేందుకు ఆస్కారం
నేర పరిశోధనలో నాణ్యతను పెంచడంతోపాటు న్యాయస్థానాల్లో అభియోగాలను సమర్థంగా నిరూపించేందుకు పోలీస్ జీపీటీ ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన సూచనలు అందడం వల్ల కేసుల విచారణ మరింత పకడ్బందీగా జరిగే అవకాశం ఉంది.
ఫలితంగా న్యాయస్థానాల్లో నేర నిరూపణ, శిక్షల శాతం పెరిగేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో శిక్షల శాతం 40లోపే ఉంది. ఈ పరిస్థితిని మెరుగుపరచడంలో పోలీస్ జీపీటీ కీలకంగా మారుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
వివరాలు
ఎలా పనిచేస్తుందంటే..? -
ఏదైనా నేర ఘటనకు సంబంధించిన దర్యాప్తు గురించి పోలీస్ జీపీటీని ప్రశ్నిస్తే.. ఆ కేసులో అనుసరించాల్సిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) గురించి వివరాలు అందిస్తుంది.
ఏదైనా ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే అందులోని ఫొటోలు, పాఠ్య సమాచారాన్ని స్కాన్ చేసి, శోధించడానికి వీలైన రూపంలోకి మారుస్తుంది.
ఇచ్చే ప్రతి సమాధానానికి ఆధారంగా ఉన్న సంబంధిత పత్రం ఏదో కూడా తెలియజేస్తుంది. దీంతో దర్యాప్తు అధికారులు సమాచారాన్ని ధ్రువీకరించుకునే అవకాశం ఉంటుంది.