Telangana:వైఎస్ మాజీ పీఏ సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు, ముగ్గురు పోలీసులపై కేసు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుపై పోలీస్ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురు పోలీస్ అధికారులపైనా హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణాలో కేసు రిజిస్టర్ అయ్యింది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టారని, మామ సూరీడు సహా మరో ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టుకెక్కారు. దీంతో కోర్టు ఆదేశం మేరకు మంగళవారం కేసు నమోదైంది. కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డితో సూరీడు కుమార్తె పెళ్లిచేశారు. కొంతకాలానికి దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సూరీడి కుమార్తె భర్తపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు.
మామ అల్లుళ్ల మధ్య గొడవ
సురేందర్‌రెడ్డి, 2021 మార్చి 23న రాత్రి 7.30 సమయంలో క్రికెట్ ఆడాక తన కుమార్తెను చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని మామ సూరీడు ఇంటికెళ్లారు. ఈ క్రమంలోనే మామా అల్లుళ్ల ఘర్షణలో అల్లుడిపై సూరీడు దాడి చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు, సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్రికెట్ బ్యాట్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు, ప్రస్తుతం ఏపీలో ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి అక్రమ నిర్బంధం చేసి, తనపై దాడి చేశారని అల్లుడు సురేందర్ రెడ్డి ఆరోపించారు.
గతంలోనూ ఐజీ పాలరాజుపై కేసు నమోదు
ఈ నేపథ్యంలోనే తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, ఆపై తప్పుడు కేసులు బనాయించారని సురేందర్‌రెడ్డి వాదిస్తున్నారు. ఈ మేరకు సూరీడు అలియాస్ సూర్యనారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నరేష్, పాలరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గత మంగళవారం మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లడంతో, న్యాయమూర్తి సురేందర్, వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదుకు బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు. అయితే గతంలోనూ ఐజీ పాలరాజుపై, అల్లుడు సురేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో, సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదు కావడం గమనార్హం.