Telangana: తెలంగాణలో చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల జమ 26కు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ,కొత్త పెన్షన్ల నిధుల జమ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో ఈ కార్యక్రమాలను ఈ నెల 26కువాయిదా వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ,చేయూత పెన్షన్ల నిధుల జమ కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ రెండు కార్యక్రమాలను విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు,అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో చేయూత పెన్షన్ నిధులను జమ చేయనున్నారు.
వివరాలు
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ
రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే 4,63,857 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్‌ను ఆదేశించారు.
ఈసారి మహిళలకు పంపిణీ చేసేందుకు చిలకపచ్చ రంగు చీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఇప్పటికే ఆ చీరలు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. మరోవైపు కొత్త పెన్షన్లకు సంబంధించిన పత్రాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది.
దీంతో ఈ నెల 26న చీరల పంపిణీ, పెన్షన్ నిధుల జమ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.