LOADING...
Telangana: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి
70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి

Telangana: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

2025-26 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి చరిత్రలోనే అత్యధికంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు ద్వారా 13.97 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందారని తెలిపారు. మంత్రి వివరాల ప్రకారం, గతంలో నమోదైన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు రికార్డును ఈ ఖరీఫ్ సీజన్‌లో అధిగమించారు. ఈసారి ప్రభుత్వం సేకరించిన మొత్తం 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో, 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

 రైతుల ఖాతాల్లోకి రూ.16,602 కోట్లు జమ 

రాష్ట్రవ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు ఎంఎస్పీ కింద మద్దతు ధర అందించామని తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన మొత్తం ఎంఎస్పీ విలువ రూ.16,912 కోట్లకు పైగా ఉందని చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ.16,602 కోట్లు జమ చేశామని, దాదాపు 98 శాతం చెల్లింపుల ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. రైతులకు మరింత ప్రోత్సాహంగా ప్రభుత్వం మొత్తం రూ.1,425 కోట్ల బోనస్ చెల్లింపులు కూడా అందించినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు మరింత సులభంగా సాగేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కీలకంగా మారిందని వివరించారు.

వివరాలు 

రైతాంగం సంపూర్ణ భాగస్వామ్యం వల్లే ఈ స్థాయి రికార్డు సాధ్యం 

ధాన్యం సేకరణలో పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం, అలాగే తెలంగాణ రైతాంగం సంపూర్ణ భాగస్వామ్యం వల్లే ఈ స్థాయి రికార్డు సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇదే సమన్వయంతో పని చేస్తూ రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement