Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. రానున్న రెండు రోజులు.. అంటే ఆగస్టు 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సోమవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచనలు అందాయి.
వివరాలు
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
ఇదిలా ఉండగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది.
నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ముఖ్యంగా నదులు, వాగులు, ఇతర నీటి ప్రవాహాల సమీపంలో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు.