LOADING...
Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ మార్గదర్శకాలు విడుదల

Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ మార్గదర్శకాలు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్‌ శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రణాళికలో రిజర్వేషన్‌ విధానం, అమలు మార్గదర్శకాలు, సంబంధిత ఇతర అంశాలు వివరించబడ్డాయి. మొత్తం రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. అలాగే ఈ ప్రత్యక్ష ఎన్నికల అనంతరం 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్లను పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నట్లు పేర్కొంది.

వివరాలు 

రిజర్వేషన్ విధానం 

బీసీ వర్గానికి రిజర్వేషన్లు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే (SEEEPC) ఆధారంగా 42 శాతం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు స్థానాల్లో కనీసం 50% రిజర్వేషన్లు ఎస్టీ వర్గానికి కేటాయిస్తారు. 100% ఎస్టీ గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నీ పూర్తిగా ఎస్టీ వర్గానికే కేటాయించబడతాయి.

వివరాలు 

అధికారుల బాధ్యతలు 

జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యత పంచాయతీరాజ్‌, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్‌దే. జడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను కలెక్టర్‌ నిర్ణయిస్తారు. ఎంపీటీసీ, సర్పంచి పదవుల రిజర్వేషన్లను ఆర్డీవో ఖరారు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను నిర్ణయించే బాధ్యత ఎంపీడీవోకు ఉంటుంది.

వివరాలు 

కేటాయింపు విధానం 

గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు ఈసారి మినహాయిస్తారు. మిగిలిన సీట్లలో ఆయా వర్గాలకు కొత్త రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు జనరల్‌ వర్గంలోనూ 50% స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. గతంలో మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానాలను మినహాయించి, మిగిలిన సీట్లలో లాటరీ విధానంతో ఈ కేటాయింపులు జరుపుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వ్‌ చేసిన తరువాత మిగిలిన సీట్లు సాధారణ (అన్‌రిజర్వ్డ్‌) కేటగిరీగా పరిగణించబడతాయి.