Rajiv yuva vikasam: రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం.. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో ఐదులక్షల మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రూ.6వేల కోట్లు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
మంగళవారం హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
"యువత అభివృద్ధిపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ కార్పొరేషన్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత స్వయంఉపాధి పథకాలు పొందలేక ఇబ్బందులు పడ్డారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం రూపొందించాం. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.3లక్షల వరకూ ఆర్థిక సాయం అందించేందుకు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం.నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తాం
ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన,లబ్ధిదారుల ఎంపిక చేపడతాం.
జూన్ 2న, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తాం.
లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారు"అని భట్టి విక్రమార్క తెలిపారు.
చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.540కోట్లు కేటాయించినట్లు తెలిపారు.దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని చెప్పారు.
వర్సిటీలోని హెరిటేజ్ భవనాలను పునరుద్ధరించేందుకు రూ.15.5కోట్లు,కొత్త భవన నిర్మాణాలకు రూ.100కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
వర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదికి సమీపంగా ఉంది.పునరుజ్జీవ పథకం పూర్తయిన తరువాత దానిని తిరిగి తెరవాలని నిర్ణయించాం.
అధికారులతో కలిసి హెరిటేజ్ భవనాలను పరిశీలించాం"అని ఆయన పేర్కొన్నారు.