LOADING...
Telangana: వస్తు నిల్వ, రవాణాకు వెన్నెముకగా తెలంగాణ.. ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య లాజిస్టిక్స్‌ కారిడార్
ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య లాజిస్టిక్స్‌ కారిడార్

Telangana: వస్తు నిల్వ, రవాణాకు వెన్నెముకగా తెలంగాణ.. ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య లాజిస్టిక్స్‌ కారిడార్

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వస్తువుల నిల్వ, రవాణా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా తెలంగాణను నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ లక్ష్యంతో 'లాజిస్టిక్స్‌ పాలసీ 2.0' పేరుతో నూతన విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. ఒక వస్తువు తయారైన ప్రదేశం నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు జరిగే అన్ని ప్రక్రియలను కలిపి రవాణా వ్యవస్థగా పరిగణిస్తారు. సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం అయినప్పటికీ ఆ లోటును అధిగమిస్తూ ఈ రంగంలో తెలంగాణను కీలక స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ విజన్‌-2047లో భాగంగా ప్రతిపాదించిన పరిసర పట్టణ ఆర్థిక మండలాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చగలవని సర్కారు విశ్వసిస్తోంది.

వివరాలు 

యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు

బాహ్య వలయ మార్గం, ప్రాంతీయ వలయ మార్గం మధ్య ఉన్న ప్రాంతాన్ని రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పండే పంటలు, తయారయ్యే వస్తువులు వేగంగా నగరాలు, ఎగుమతి కేంద్రాలకు చేరే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక సముదాయాలు నేరుగా మార్కెట్లు, ఓడరేవులతో అనుసంధానమవడంతో రైతులు, చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 వరకు కొత్త రవాణా పార్కులు, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు.

వివరాలు 

పెరుగనున్న ఎగుమతి శక్తి

హైదరాబాద్‌ ఇప్పటికే దక్షిణ, మధ్య భారతదేశాలకు ప్రధాన పంపిణీ కేంద్రంగా ఎదిగింది. ఔషధ, జీవ శాస్త్ర, విమాన, విద్యుత్‌ పరికరాలు, ఆన్‌లైన్‌ వాణిజ్య రంగాలకు ఇది కీలక కేంద్రంగా మారింది. మంగళపల్లి, బాటసింగారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమగ్ర రవాణా పార్కులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధిక ప్రమాణాల నిల్వ కేంద్రాల అవసరం కూడా వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌-2047 దృష్టి పత్రంలో రవాణా రంగాన్ని వ్యూహాత్మక వృద్ధి సాధనంగా గుర్తించారు. ప్రాంతీయ వలయ మార్గం సమీపంలో భారీ అంతర్గత నౌకాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని 297 కిలోమీటర్ల నూతన వేగవంతమైన రహదారి, రైలుమార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఓడరేవులతో అనుసంధానించనున్నారు.

Advertisement

వివరాలు 

రవాణా ఖర్చులు తగ్గింపు... పరిశ్రమలకు బలం

దీనివల్ల రాష్ట్ర ఎగుమతి సామర్థ్యం మరింత పెరుగుతుంది. మనోహరాబాద్‌లో ప్రతిపాదించిన మెగా బహుముఖ రవాణా పార్క్‌ దేశ రవాణా వ్యవస్థలో తెలంగాణ స్థాయిని బలపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. 2047 నాటికి దేశ ఆర్థికోత్పత్తిలో రాష్ట్ర వాటాను 5 శాతం నుంచి 10శాతానికి పెంచడంలో ఈ విధానం కీలకంగా మారనుంది. దేశంలో రవాణా వ్యయం మొత్తం ఆర్థికోత్పత్తిలో దాదాపు 13 నుంచి 14శాతం వరకు ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 8 నుంచి 9శాతానికి పరిమితమై ఉంది. కొత్తవిధానం అమలుతో తెలంగాణలో ఈ ఖర్చులను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో బహుముఖ రవాణా అనుసంధానం, డిజిటల్‌ సదుపాయాలు,పర్యావరణ హిత రవాణా విధానాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.

Advertisement

వివరాలు 

చిన్న పరిశ్రమలకు ప్రపంచ అనుసంధానం

దీని ద్వారా రవాణా వేగం పెరిగి ఖర్చులు తగ్గుతాయి. తయారీ రంగం, ఔషధ, విద్యుత్‌ పరికరాల సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ చేసే స్థాయికి చేరుకుంటాయి. కొత్త విధానం ప్రకారం ప్రతి జిల్లాలో శీతల నిల్వ కేంద్రాలు,సాధారణ సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా జిల్లా స్థాయిలో తయారయ్యే ఉత్పత్తులు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు చేరే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పన్ను మినహాయింపులు, ఆర్థిక ప్రోత్సాహకాలు చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు అదనపు బలాన్ని అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శూన్య ఉద్గార విధానాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యుత్‌ వాహనాల వినియోగం,పర్యావరణ హిత నిల్వ కేంద్రాలు,సౌరశక్తితో నడిచే రవాణా పార్కుల అభివృద్ధి ద్వారా సుస్థిర అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Advertisement