PM-KUSUM: 'పీఎం కుసుమ్' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పంటల సాగుతోపాటు వ్యవసాయ భూముల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇస్తూ, ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 'ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) పథకానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఈ పథకం కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరములో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం అనుమతిని అందించింది. ఈ పథకానికి 'తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ' (టీజీరెడ్కో) నోడల్ ఏజెన్సీగా నియమించబడింది.
10 ఎకరాల భూమి ఉంటే 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్
సబ్ స్టేషన్ ల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు సంబంధిత జాబితాను డిస్కంలు విడుదల చేస్తాయి. ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ లకు చేరే విధంగా లైను, మౌలిక వసతుల ఏర్పాటుకు డిస్కం బాధ్యత వహిస్తుంది. రైతు స్వంతంగా 10 ఎకరాల భూమి ఉంటే 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1 మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా. ఈ పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణ సాయం పొందవచ్చు.
రూ.3 నుండి రూ.3.15 వరకు చెల్లించి కొనుగోలు
గ్రామ పంచాయతీ, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ఇతర సంస్థలు లేదా కంపెనీల భాగస్వామ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది. భూమి యజమాని కంపెనీకి లీజుకు ఇచ్చి, కంపెనీ నుండి వచ్చే లీజు సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. డిస్కంలు ఈ విద్యుత్‌ను రూ.3 నుండి రూ.3.15 వరకు చెల్లించి కొనుగోలు చేసే అవకాశం ఉంది.