Telangana: తెలంగాణలో అత్యాధునిక ఆర్టీసీ టెర్మినళ్లు.. ప్రైవేటు బస్సులకూ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు ఆర్టీసీ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ టెర్మినళ్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రైవేటు బస్సులు కూడా వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
వివరాలు
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని తాటిపల్లి, మోరపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
మంత్రి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మహిళల కోసం మహాలక్ష్మి పథకం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం ప్రారంభించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించామని చెప్పారు.
వివరాలు
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యం
ప్రజా రవాణాలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ముఖ్యంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు.
వివరాలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, కారుణ్య నియామకాలు చేపట్టడం, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పొన్నం ప్రభాకర్ వివరించారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.