Telangana: తెలంగాణలో డిజిటల్ ఆరోగ్య సేవలు.. సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో డిజిటల్ సాంకేతికతను మరింతగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వ్యక్తి పేరుతో ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభ దశలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ.94 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి ఒక సమగ్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు. దీనితో పాటు వారికి ప్రత్యేకంగా హెల్త్ కార్డులు కూడా జారీ చేయనున్నారు.
వివరాలు
కాగిత రహిత వైద్యం దిశగా తెలంగాణ
ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ఇకపై ఎలాంటి చీటీలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా వైద్యులను సంప్రదించగలిగేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. హెల్త్‌కార్డు ఆధారంగా రోగులు చికిత్స పొందడంతో పాటు మందులు కూడా పొందేలా ఈ సేవలను కాగితరహిత విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా 'ఆభా' (ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఎకౌంట్) నంబర్లను రూపొందిస్తున్నారు.
వివరాలు
ఆభా నంబర్లతో అనుసంధానం..
ఓపీ విభాగాల్లో రోగులు స్లిప్‌లు సులభంగా పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఈ 'ఆభా' వ్యవస్థకు అనుసంధానంగా మరింత పకడ్బందీగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీజీ ఆన్‌లైన్ వేదిక ద్వారా ఆరోగ్యశ్రీ విభాగం ఈ కార్యక్రమానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో అనుసంధానకర్తగా పనిచేస్తోంది. హెల్త్‌కార్డు కలిగిన వ్యక్తులు పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా, వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులోనే నమోదు అయి అందుబాటులో ఉంటాయి. దీంతో రోగుల వైద్య చరిత్రను వైద్యులు సులభంగా తెలుసుకుని చికిత్స అందించే అవకాశం ఉంటుంది.