Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు.. రేపు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-నరసాపురం మధ్య తుపాను తీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉంది. అనంతరం బుధ, గురువారాల్లో మధ్య తెలంగాణ జిల్లాల వైపు ప్రయాణించి బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ ఎస్.స్టెల్లా రాష్ట్రంలో రోజువారీగా వర్షాల ప్రభావం ఉండే జిల్లాల వివరాలను వెల్లడించారు.
వివరాలు
సోమవారం ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
మంగళవారం మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
బుధవారం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.