LOADING...
Telangana: విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూకుడు.. దేశంలో నంబర్‌వన్ ర్యాంకు!
విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూకుడు.. దేశంలో నంబర్‌వన్ ర్యాంకు!

Telangana: విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూకుడు.. దేశంలో నంబర్‌వన్ ర్యాంకు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటింది. 2026 ఏప్రిల్ నెలలో విద్యుత్ వినియోగం 20.5 శాతం పెరుగుదలతో దేశంలోనే తొలి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగ వృద్ధిరేటు 3.7 శాతంగా నమోదవగా, తెలంగాణలో అది ఐదు రెట్లకు పైగా ఉండటం విశేషం. సీఈఏ గణాంకాల ప్రకారం, తెలంగాణ తర్వాత బిహార్ 20.1 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలవగా, కర్ణాటక 19 శాతంతో మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ 11.9 శాతంతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి.

వివరాలు 

విద్యుత్ వినియోగంలో తెలంగాణ 87,266 మిలియన్ యూనిట్లతో దేశంలో ఎనిమిదో స్థానం

2025 ఏప్రిల్‌లో తెలంగాణలో 7,430 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ వినియోగం నమోదైంది. 2026 ఏప్రిల్ నాటికి ఇది 20.5 శాతం పెరిగి 8,953 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరణ,నిర్మాణ రంగం వేగవంతం కావడం,ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం విద్యుత్ వినియోగంలో తెలంగాణ 87,266 మిలియన్ యూనిట్లతో దేశంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 2.02 లక్షల మిలియన్ యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా,ఉత్తరప్రదేశ్ 1.63 లక్షల మిలియన్ యూనిట్లు,తమిళనాడు 1.32 లక్షల మిలియన్ యూనిట్లు,రాజస్థాన్ 1.10 లక్షల మిలియన్ యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వివరాలు 

వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ ముందంజ

ఆంధ్రప్రదేశ్ 81,187మిలియన్ యూనిట్ల వినియోగంతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2025 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 1.37కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా,ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 3.11లక్షల కొత్త కనెక్షన్లు జతకావడంతో మొత్తం సంఖ్య 1.40కోట్లను దాటింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో గృహ కనెక్షన్లు పెరగడం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది.రాష్ట్రంలో 30.36లక్షలకు పైగా వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత ఏడాదిలోనే డిస్కంలు కొత్తగా 1.08లక్షల వ్యవసాయ బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించాయి. ప్రస్తుతం మరో లక్షమంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement