Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ వివరాలను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగో విడతలో ఒకేదశలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. 2019లో తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఒకే దశలో ఓటింగ్ జరిగింది.
ఏప్రిల్ 18న నోటిఫికేషన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఏప్రిల్ 25వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడించనుంది. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే లోక్‌సభ ఎన్నికలు రావడం ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 35% ఓట్లతో BRS 9 స్థానాలను గెలుచుకొంది. బీజేపీ నాలుగు సీట్లలో విజయం సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ 3 స్థానాలను సొంతం చేసుకుంది.