Gram Panchayat Elections: 331 పెండింగ్ పంచాయతీలపై నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పంచాయతీరాజ్ శాఖను కోరింది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా ఎన్నికలు జరగని 331 గ్రామ పంచాయతీల తాజా పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో పురపాలక సంస్థలు,నగరపాలక సంస్థలు,నగర పంచాయతీల్లో విలీనం చేసిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఏవైనా న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయా అనే అంశంపైనా వివరాలు ఇవ్వాలని సూచించింది.
వివరాలు
కొత్త ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం,రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో చర్యలు
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు అధికారికంగా లేఖ పంపించారు. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో కొత్త ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం,రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ పూర్తయింది. ఇక డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 13,098 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా,కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా 331 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
వివరాలు
51 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం
ఈసారి వీలైనంత వరకు అన్ని గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిన తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వివరాలను సమీక్షిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 51 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 280 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కేసులు ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థల్లో విలీనం చేసిన కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన న్యాయ వివాదాల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నివేదించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
వివరాలు
విభజన, విలీన ప్రతిపాదనలపై ఇంకా స్పష్టత లేదు
గ్రామ పంచాయతీలను రెండుగా విభజించడం లేదా సమీప గ్రామ పంచాయతీల్లో విలీనం చేయడం వంటి అంశాలపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. సర్పంచుల పదవీకాలం ముగియడానికి రెండు నెలల ముందే అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. గ్రామ సభల్లో తీర్మానాలు ఆమోదించి మొత్తం 400 ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.
వివరాలు
విభజన, విలీన ప్రతిపాదనలపై ఇంకా స్పష్టత లేదు
విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలను విభజించాలని ప్రజలు ఎక్కువగా కోరగా, సమీప గ్రామ పంచాయతీల్లో విలీనం చేసే ప్రతిపాదనలు మాత్రం పరిమిత సంఖ్యలోనే వచ్చాయి. అయితే ప్రస్తుతం జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాల సరిహద్దుల్లో మార్పులు చేయడం సాధ్యం కాకపోవడంతో విభజన, విలీన ప్రతిపాదనలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే ఈ అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.