LOADING...
Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక
అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక

Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర గణాంకాల శాఖ సర్వే ప్రకారం,ఆంధ్రప్రదేశ్‌లో 43.7శాతం మంది,తెలంగాణలో 37.2శాతం మంది అప్పుల్లో చిక్కుకుపోయినట్లు వెల్లడైంది. ఈ పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో,తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. ఏపీలో 15ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3శాతం మంది బ్యాంకింగ్‌ సేవలతో అనుసంధానమై (ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌) ఉన్నారు. ఈ విషయంలో కర్ణాటక (95.9%)తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకుంది.అయితే కర్ణాటకలో మాత్రం కేవలం 23.2శాతం మందిపైనే అప్పుల భారం ఉంది. తెలంగాణలో 86.5 శాతం మంది మాత్రమే బ్యాంకింగ్‌ వ్యవస్థ పరిధిలో ఉన్నారు.ఈ పరంగా దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉంది.

వివరాలు 

ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగు 

దక్షిణాది రాష్ట్రాలను మొత్తంగా పరిశీలిస్తే, సగటున 92.1 శాతం ప్రజలు ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ పరిధిలో ఉండగా, 31.8 శాతం మంది అప్పుల భారంతో బాధపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడ 80.2 శాతం మంది మాత్రమే బ్యాంకింగ్‌ సేవలు ఉపయోగించుకుంటున్నా అప్పుల్లో ఉన్నవారి శాతం కేవలం 7.4 శాతమే. మతాల వారీగా చూస్తే, హిందువులలో ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ 88.1 శాతం ఉండగా,ముస్లింలలో అది 80.8 శాతంగా నమోదైంది. లింగాల వారీగా పురుషుల్లో 89.8 శాతం మంది బ్యాంకింగ్‌ సేవలు పొందుతుండగా,మహిళలలో ఈ శాతం 84.5 మాత్రమే.

వివరాలు 

ఈ కుటుంబాల్లో అప్పుల ఒత్తిడి ఎక్కువ

సామాజిక వర్గాల దృష్ట్యా పరిశీలిస్తే, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు)లో 16.6 శాతం మంది అప్పుల బారిన పడగా, గిరిజనులలో ఈ సంఖ్య 11 శాతంగా తక్కువగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో అప్పుల భారం తక్కువగా ఉండగా, తక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాల్లో అప్పుల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.