Bangalore Temperature: అగ్నిగుండంలో బెంగళూరు...నీటి ఎద్దడి తప్పదని ఆందోళనలో నగరవాసులు
బెంగళూరు అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాల్లో సతమతమవుతున్న బెంగళూరు వాసులు ప్రస్తుత ఎండలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగితే మళ్లీ బెంగళూరు వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవని ఆందోళన పడిపోతున్నారు. బెంగళూరులో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. 2016 ఏప్రిల్ నెలలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలుగా నమోదైంది. ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతను చేరుకునేందుకు గానీ ప్రస్తుత టెంపరేచర్ ను చూస్తే ఎన్నో రోజులు పట్టేలా లేదు. బెంగళూరులో ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే ప్రస్తుతం 3 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నాయి.
ఎల్నినో కారణంగానే....
వాతావరణ మార్పులు, ఎల్ నినో కారణంగానే గతేడాది వర్షాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతుంటే ఇక రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు వారి దినచర్యను మార్చుకుంటున్నారు.