Loading...
Amaravati: పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్‌బోర్డు కీలక దస్త్రాల బదిలీ
పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్‌బోర్డు కీలక దస్త్రాల బదిలీ

Amaravati: పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్‌బోర్డు కీలక దస్త్రాల బదిలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఏపీకి చెందిన 3,503 దస్త్రాలు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజిట్లతో పాటు ఇతర కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు అధికారికంగా అప్పగించింది. ఈ రికార్డులు మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చేరనున్నాయి. ఈ దస్త్రాలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని కీలక వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అధికారిక సమాచారం ఏపీ వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయిలో లభించనుంది. దీంతో ఆస్తుల సంరక్షణ, యాజమాన్య హక్కుల పరిరక్షణ మరింత బలోపేతం కానుంది.

వివరాలు

సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి వచ్చిన సమస్య

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఏపీ వక్ఫ్‌బోర్డు పరిధిలోని కొంతమంది అధికారులు కొన్ని రికార్డులను మాత్రమే రాష్ట్రానికి తీసుకురాగలిగారు.

అయితే వేల సంఖ్యలో ఉన్న ముఖ్యమైన దస్త్రాలు తెలంగాణలోని రికార్డు గదుల్లోనే మిగిలిపోయాయి.

విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం, అప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రికార్డులను ఏపీకి బదిలీ చేయడానికి అంగీకరించినప్పటికీ, తెలంగాణ వక్ఫ్‌బోర్డు నుంచి తుది ఆమోదం రాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల వక్ఫ్‌బోర్డు అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

అయితే 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.

వివరాలు

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఊతం

ఏపీకి చెందిన కీలక వక్ఫ్ ఆస్తుల రికార్డులు తెలంగాణలోనే ఉండటంతో ఇప్పటివరకు అనేక సమస్యలు తలెత్తాయి.

ముఖ్యంగా...

ఆస్తుల పరిరక్షణ,

యాజమాన్య హక్కుల నిర్ధారణ,

ఆక్రమణల తొలగింపు,

కోర్టు కేసుల నిర్వహణ

వంటి అంశాల్లో తీవ్ర జాప్యం నెలకొంది

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని పలుచోట్ల వక్ఫ్ ఆస్తులపై అక్రమ ఆక్రమణలు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పుడు పూర్తి స్థాయి రికార్డులు ఏపీకి అందుబాటులోకి రావడంతో అలాంటి ఆక్రమణలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని వక్ఫ్‌బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

తెలంగాణ అధికారులకు ఏపీ వక్ఫ్‌బోర్డు కృతజ్ఞతలు

రికార్డుల అప్పగింత ప్రక్రియ పూర్తవడంతో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలంగాణ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌తో పాటు సంబంధిత అధికారులకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT