
Raviryala - Amanagallu Road: రావిర్యాల - ఆమనగల్లు రహదారి నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్ట్‌కి అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని (ఓఆర్‌ఆర్) రావిర్యాల నుంచి రీజినల్ రింగ్ రోడ్డులోని (ఆర్‌ఆర్‌ఆర్) ఆమనగల్లు వరకు సాగనున్న ఈ రహదారి మొత్తం 41.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారికి 'రతన్‌టాటా రహదారి' అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును రెండు విడతలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో రావిర్యాల (టాటా ఇంటర్‌ఛేంజ్) నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.20కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనుండగా,రెండో దశలో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపడతారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ)టెండర్లు ఖరారు చేసిన నేపథ్యంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 11 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు
ఈ రెండు దశల రహదారి నిర్మాణానికి మొత్తం రూ.4,030 కోట్లు ఖర్చు అవుతుంది. అదనంగా 1,003 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.591 కోట్లు వెచ్చించనున్నారు. ఈ రహదారి ఓఆర్‌ఆర్ నుంచి మహేశ్వరం,ఇబ్రహీంపట్నం,కందుకూరు, యాచారం,కడ్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా సాగుతుంది. మొత్తం 26 గ్రామాల పరిధిలో ఈ రహదారి వెళ్తుంది. ప్రభుత్వం గతంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య 11 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా మొదటిగా రావిర్యాల - ఆమనగల్లు రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఇదే రహదారి ద్వారా భవిష్యత్తులో నిర్మించబోయే స్కిల్స్ యూనివర్సిటీకి కనెక్షన్ ఏర్పడనుంది.
వివరాలు
రహదారి విశేషాలు:
ఈ రహదారి 3+3 వరుసలుగా (లేన్లు) రూపొందించనున్నారు. భవిష్యత్తులో దీన్ని 4+4 లేన్ల రహదారిగా విస్తరించేందుకు కూడా అవకాశం ఉంది. మొత్తం రహదారి వెడల్పు 100 మీటర్లు కాగా, మధ్యలో 20 మీటర్ల స్థలాన్ని మెట్రో రైలు/రైల్వే కోసం రిజర్వ్ చేశారు. ఈ రహదారిలో: మూడు లైన్ల సర్వీస్ రోడ్లు, 2 మీటర్ల గ్రీన్‌బెల్ట్, 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల ఫుట్‌పాత్, 2 మీటర్ల యుటిలిటీ కారిడార్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు.