Leander Paes: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి లియాండర్ పేస్.. బెంగాల్ రాజకీయాల్లో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. కొద్ది సేపటి క్రితమే బీజేపీ తీర్థం పుచ్చుకున్న పేస్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువా ధరించారు. అనంతరం మీడియాతో మాట్లాడి తన రాజకీయ ప్రయాణంపై సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేస్ రాజకీయ రంగ ప్రవేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చేరిక బీజేపీకి కీలక బలం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పార్టీ తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా దీన్ని చూస్తున్నారు. భారత టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన క్రీడాకారులలో ఒకరైన పేస్ రాజకీయ రంగ ప్రవేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎన్నికల హీట్‌లో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒలింపిక్స్ పతక విజేతగా, అనేక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన పేస్ ఇప్పుడు తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్టుగా భావిస్తున్నారు.
వివరాలు
తల్లి,తండ్రి క్రీడాకారులే..
ఈ ఎన్నికల్లో పేస్ స్వయంగా పోటీ చేసే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రచారంలో మాత్రం కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనకు ఉన్న భారీ ప్రజాదరణ యువ ఓటర్లపై ప్రభావం చూపుతుందని బీజేపీ నమ్మకం వ్యక్తం చేస్తోంది. 1973 జూన్ 17న కోల్‌కతాలో జన్మించిన పేస్ క్రీడా వాతావరణంలోనే పెరిగారు. ఆయన తండ్రి వెంకట్రామన్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో హాకీలో కాంస్య పతకం గెలిచారు. తల్లి జెన్నిఫర్ పేస్ 1980 ఆసియా బాస్కెట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించారు. గత ఏడాది ఆయన తండ్రి కన్నుమూశారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్య పతకం సాధించారు.
వివరాలు
పురుషుల డబుల్స్‌లో మొత్తం ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచారు. దేశానికి చేసిన విశేష సేవలకు గాను ఆయన అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 1990లో అర్జున అవార్డు, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌తో సత్కరించారు. పురుషుల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలవకపోయినా, డబుల్స్ విభాగంలో మాత్రం పేస్ చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో మొత్తం ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లలో అనేకసార్లు విజేతగా నిలిచారు.
వివరాలు
మిక్స్‌డ్ డబుల్స్‌లో.. 10 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పేస్ అద్భుత ప్రతిభ చూపారు. మొత్తం 10 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి రికార్డు నెలకొల్పారు. ఇందులో మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు వింబుల్డన్, రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. ఈ అద్భుత విజయాలతో పేస్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఆయన చూపే ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.