PM Modi: మోదీ వ్యాఖ్యలతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. పీఎంఓతో జ్యువెలరీ అసోసియేషన్ భేటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా విజ్ఞప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశం నెలకొంది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని లేదా వీలైతే దూరంగా ఉండాలని ప్రధాని ప్రజలకు సూచించినట్లు ప్రచారం జరుగుతుండటంతో జ్యువెలరీ రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బంగారు వ్యాపారుల సంఘమైన జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారులతో సమావేశం కావడానికి అనుమతి కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సమస్యలు పీఎంఓ దృష్టికి
ప్రధాని వ్యాఖ్యల ప్రభావం బంగారం విక్రయాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్న వ్యాపార వర్గాలు.. తమ ఆందోళనలు, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పీఎంఓ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జువెలరీ రంగంపై ఆర్థిక ప్రభావం, వినియోగదారుల కొనుగోలు ధోరణుల్లో వచ్చే మార్పులపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. అలాగే బంగారం వ్యాపారానికి ఊతమిచ్చే విధానాలు, పరిశ్రమకు అవసరమైన మద్దతు చర్యలపై కూడా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.