Mamata Banerjee: కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ఇటీవల కోల్‌కతాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమం నుంచి మెస్సి ముందుగానే వెళ్లిపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. మెస్సికి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్ (X) వేదికగా ఓ పోస్టు చేశారు. 'ఈ రోజు సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి తీవ్రంగా కలత చెందాను.
Details
విచారణ కమిటీ ఏర్పాటు
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సిని చూసేందుకు వచ్చిన వేలాది మంది క్రీడాభిమానులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో నేను స్టేడియానికి బయలుదేరాను. అయితే అక్కడి పరిస్థితిని తెలుసుకున్న తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది. స్టేడియంలో జరిగిన ఘటనకు మెస్సికి, ఆయన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ ఘటనపై జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Details
ఇది అవమానకరం : బీజేపీ
ఇదిలా ఉండగా, కార్యక్రమ నిర్వహణ లోపంపై రాజకీయ దుమారం చెలరేగింది. అంతర్జాతీయ వేదికపై ఇది అవమానకరమైన ఘటనగా బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్ పునావాలా విమర్శలు గుప్పించారు. 'మెస్సి వంటి ప్రపంచస్థాయి ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు. అలాంటి కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్క కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేరు. మెస్సి చుట్టూ టీఎంసీ నేతలు చేరి, అభిమానులను దగ్గరకు కూడా రానివ్వలేదు.
Details
తొందరగా వెనుతిరిగిన మెస్సీ
అందుకే మెస్సి తొందరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు అలాగే అభిమానులకు గానీ, అతిథికి గానీ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు పూర్తిగా నిర్వహణ లోపం వల్లే జరిగాయి. దీనిపై ఆగ్రహంతో అభిమానులు సీసాలు, కుర్చీలను విసిరేశారని షెహబాజ్ పునావాలా విమర్శించారు.