Flights: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఎఫెక్టు.. 400కిపైగా విమానాలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం 444 విదేశీ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్ని విమానాలు రద్దవుతాయి, ఎన్ని ఆలస్యమవుతాయన్న అంశంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి 28న 410 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విమానాల రద్దుతో విమానాశ్రయాల్లో రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్ అధికారులను నియమించినట్లు అధికారులు తెలిపారు.
Details
అంతర్జాతీయ సర్వీసులు రద్దు
ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ వేదిక 'ఎయిర్‌సేవ'కు 216 ఫిర్యాదులు అందగా, వాటిలో 105ను ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, ఆపరేషన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం కొనసాగుతున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) పేర్కొంది. విమానాల మళ్లింపులు, రద్దుల నేపథ్యంలో ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు సూచించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఆదివారం సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. లండన్, షికాగో, టొరంటో, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు వెల్లడించింది.