Loading...
Delhi Court : ఉగ్ర నిధుల కేసులో యాసిన్ మాలిక్ సహా ఏడుగురిపై చార్జీలకు కోర్టు ఆదేశం
ఉగ్ర నిధుల కేసులో యాసిన్ మాలిక్ సహా ఏడుగురిపై చార్జీలకు కోర్టు ఆదేశం

Delhi Court : ఉగ్ర నిధుల కేసులో యాసిన్ మాలిక్ సహా ఏడుగురిపై చార్జీలకు కోర్టు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు సంబంధించిన ఉగ్ర నిధుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద యాసిన్ మాలిక్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు, ఒక సంస్థపై అభియోగాలు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద, విధ్వంసక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు పాకిస్థాన్ నుంచి హవాలా మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకున్నారన్న ఆరోపణలపై ఈ కేసు కొనసాగుతోంది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది.

వివరాలు 

రూ.8.94కోట్ల నేరపూరిత ఆదాయం.. ఈడీ ఆరోపణలు

నిందితులపై అభియోగాలు నమోదు చేసేందుకు ప్రాథమికంగా సరిపడా ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ కేసులో మొత్తం రూ.8.94కోట్ల నేరపూరిత ఆదాయం సమకూరినట్లు ఈడీ ఆరోపించింది.

ఇందులో యాసిన్ మాలిక్ సౌదీ అరేబియా నుంచి అందుకున్న రూ.15.75లక్షలతో పాటు మొత్తం రూ.30.75లక్షల మేర విదేశీ నిధులను నేరపూరిత ఆదాయంగా పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది.

2017లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది.

ఈ కేసులో యాసిన్ మాలిక్‌తో పాటు జహూర్ అహ్మద్ షా వతాలి, షబ్బీర్ అహ్మద్ షా, మసరత్ ఆలం భట్ తదితరులు నిందితులుగా ఉన్నారు.

వివరాలు 

తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా

సెప్టెంబర్ 9న ప్రత్యేక కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేయగా.. అవి గురువారం వెలుగులోకి వచ్చాయి.

భద్రతాపరమైన కారణాలతో కొంతమంది నిందితులను కోర్టుకు హాజరుపరచడం సాధ్యం కాలేదు.

దీంతో వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే అభియోగాలకు సంబంధించిన పత్రాలపై వారి సంతకాలు తీసుకోవాలని ఈడీకి న్యాయస్థానం సూచించింది.

ఈ కేసులో తదుపరి విచారణను ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈడీ ఆరోపణలు, కోర్టు ఆదేశాల ఆధారంగానే కేసు తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.

ADVERTISEMENT