Terror attacks: దేశంలో ఉగ్రదాడుల ప్లాన్ ఫెయిల్.. ముగ్గురు అనుమానితులు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఉగ్రదాడులకు సిద్ధమైన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు అడ్డుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని యత్నించిన ఉగ్రవాదుల యోజనను సకాలంలో భగ్నం చేస్తూ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆధారాలపై వీరిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఏటీఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశాం. వారిపై గత ఏడాది నుంచే నిఘా ఉంచాం. ఆయుధాల సరఫరాతో పాటు పలు రాష్ట్రాల్లో దాడులు చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Details
అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు
ఇదే ఏడాది ప్రారంభంలో కూడా గుజరాత్ ఏటీఎస్ ఐదుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వారు ఆన్‌లైన్‌లో టెర్రర్ మాడ్యూల్ నడుపుతూ, పాక్‌లోని ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. వారిలో ఒక మహిళ కూడా ఉందని అధికారులు వెల్లడించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధాల కారణంగా ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (SPOs)పై చర్యలు తీసుకున్నారు. కథువా జిల్లాకు చెందిన ఎస్పీవోలు అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్‌లు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారని తేలడంతో విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దోడా జైలుకు తరలించారని అధికారులు పేర్కొన్నారు.