TG SSC Exams 2027 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా పరీక్ష ఫీజు కట్టేందుకు గడువును పొడిగించింది. వాస్తవానికి నవంబరు 26తోనే ఫీజు చెల్లింపు గడువు ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థులు, పాఠశాలల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ గడువును డిసెంబరు 2 వరకు పెంచుతూ గురువారం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు అదనపు రుసుము లేకుండా తమ ఫీజును చెల్లించవచ్చు.
వివరాలు
పరీక్ష ఫీజుల వివరాలు ఇవే..
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆరు సబ్జెక్టులు రాసే విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మూడు సబ్జెక్టుల వరకు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రూ.110 రుసుముగా నిర్ణయించారు.
గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించే వారికి ఆలస్య రుసుమును ప్రభుత్వ పరీక్షల విభాగం ఎప్పటికప్పుడు విడుదల చేసే నోటిఫికేషన్ల ప్రకారం వసూలు చేస్తారు.
పాఠశాలలో చదవకుండా ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలకు హాజరయ్యేవారు హాజరు మినహాయింపు రుసుము కింద రూ.650 చెల్లించాలి.
ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ రుసుముతో పాటు అదనంగా మరో రూ.650 ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
వివరాలు
పరీక్ష ఫీజుల వివరాలు ఇవే..
పరీక్షల్లో పొందిన మార్కులపై రీకౌంటింగ్ కోరుకునే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలి. వయోపరిమితి సడలింపు కోసం రూ.300 రుసుము ఉంటుంది.
ఎస్ఎస్సీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమో, వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందాలంటే రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.
డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ జారీకి రూ.250 రుసుముగా నిర్ణయించారు. సాధారణ ఎస్ఎస్సీ పరీక్ష ఫీజుకు అదనంగా ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు రూ.60 చెల్లించాలి.
వివరాలు
ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి
పరీక్ష ఫీజు చెల్లించేందుకు పొడిగించిన గడువును మరోసారి పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
అందువల్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా విద్యార్థుల పరీక్ష ఫీజులను చెల్లించాలని సూచించింది.
ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలి.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in లోని స్కూల్ లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీ ఆన్లైన్ ఇంటిగ్రేషన్ విధానాన్ని ఉపయోగించాలి.
ఇతర మార్గాల్లో చెల్లించిన ఫీజులను అధికారులు అంగీకరించరు.
ముఖ్యంగా IFMIS పోర్టల్ ద్వారా రూపొందించిన చలాన్లు, బ్యాంకుల్లో మాన్యువల్‌గా చెల్లించే చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
వివరాలు
మార్చి 17 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు?
మరోవైపు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి వార్షిక పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌పై కూడా కసరత్తు జరుగుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చి 17 లేదా 18 తేదీల్లో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది.
ఏప్రిల్ 10వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ అమలులోకి వస్తే దాదాపు 24 రోజుల వ్యవధిలోనే పరీక్షల ప్రక్రియ ముగియనుంది.
వివరాలు
మార్చి 17 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు?
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించడంతో పాటు, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య తగినంత సమయం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ తాత్కాలిక పరీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఆమోదం లభించాల్సి ఉంది.
ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత పరీక్షల తేదీలను ఖరారు చేసి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.