Page Loader
Group1 Results: గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్
గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్

Group1 Results: గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన నిర్వహిస్తోంది. వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడినట్టు తెలుస్తోంది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తైన అనంతరం గ్రూప్-2, ఆపై గ్రూప్-3 ఫలితాలను వెల్లడించాలని టీజీపీ‌ఎస్‌సీ యోచిస్తోంది. తద్వారా బ్యాక్‌లాగ్‌లు లేకుండా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Details

మెరిట్ జాబితా, మార్కుల వివరాలు

గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ తొలుత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేనుంది. ఆరు పేపర్లలో సాధించిన మొత్తం మార్కులను కలిపి మెరిట్ జాబితా విడుదల చేయనుంది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచనుంది. రీకౌంటింగ్‌ అవకాశం అభ్యర్థులకు మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రీకౌంటింగ్‌ సౌకర్యం కల్పించనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.