ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి దాదాపు రూ.10, 461కోట్ల సాయాన్ని అందించింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన ఈ నిధులు పెద్ద ఉపశమనం అని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది అంటే 2014-2015లో ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైన ఆర్థిక లోటును తీర్చడానికి కేంద్రం ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ఈ నెల 19న కేంద్ర ఆర్థికశాఖ ఏడీ ఉత్తర్వులు జారీ
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం బహిరంగ రహస్యమే. జీతాల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇబ్బందులను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో కేంద్రం తొమ్మిదేళ్ల క్రితం రావాల్సిన సొమ్మును విడుదల చేయడం జగన్ నెత్తిమీద పాలు పోసినంత పనైంది. దాదాపు కొన్ని నెలలపాటు ఆంధ్రప్రదేశ్ నగదు కోసం వెతకాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఈ నెల 19న కేంద్ర ఆర్థికశాఖ ఏడీ మంజూరు చేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడదల వారీగా కేంద్రం విడుదల చేసేది. అయితే ఇంత పెద్ద మొత్తం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయడం చాలా అరుదు అనే చెప్పాలి.