Page Loader
కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

వ్రాసిన వారు Stalin
Dec 24, 2022
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది. రెండో వేవ్ ప్రారంభ రోజుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండేది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండేందుకు చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్లను తగినన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, రీఫిల్లింగ్ సిస్టమ్ నిర్వహణను కూడా పటిష్టం చేసుకోవాలని కేంద్రం సూచించింది.రాష్ట్రాలు/ యూటీల స్థాయిలో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పునరుద్ధరించాలని కేంద్రం కోరింది.

కరోనా

ఆ దేశాల నుంచి వస్తే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష

మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై చేసిన సూచనలో పీసీఏ ప్లాంట్‌లను పూర్తిగా పని చేసేలా ఉంచాలని, వాటిని తనిఖీ చేయడానికి సాధారణ మాక్ డ్రిల్‌లు చేయాలని కోరింది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని, పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం చెప్పింది. శనివారం నుంచి 2% అంతర్జాతీయ ప్రయాణికులకు రాండమ్ పరీక్షలు చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా.. ప్ర‌తి పాజిటివ్ కేసును జీనోమ్ సిక్వెన్సింగ్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పింది.