CAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది. పౌర చట్టం అమల్లోకి రావడంతో మూడు పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలు ఇప్పుడు భారత పౌరసత్వం సులువుగా పొందొచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో సీఏఏను చేర్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఏఏను అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. నోటీఫై చేసిన నాలుగేళ్ల తర్వాత.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి అమలు చేసింది.