Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ. 113 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 1,800 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది చివరి నాటికి రెండో దశ పనుల్లో భాగంగా నిర్మాణానికి అదనంగా రూ. 670 కోట్లు వెచ్చిస్తామని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఖాతాలను కూడా ధర్మకర్తల మండలి ముందు సమర్పించారు. ట్రస్ట్ సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయనుంది.
20 కిలోల బంగారం విరాళం
గత నాలుగేళ్లలో భక్తులు సుమారు 20 కిలోల బంగారం, 13 క్వింటాళ్ల వెండిని ఆలయానికి విరాళంగా ఇచ్చారని ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం, ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 మధ్య మొత్తం అంచనా వ్యయం రూ. 850 కోట్లు అవుతుందన్నారు. ట్రస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 676 కోట్ల మొత్తం ఖర్చును వెల్లడించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 363.34 కోట్లు, ఇందులో రూ. 204 కోట్లు బ్యాంకు వడ్డీ ద్వారా రూ. 58 కోట్లు విరాళాల ద్వారా వచ్చాయి.