Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల ధ్వంసం, తిరుమల లడ్డూ కల్తీ ఘటనలను నిరసిస్తూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు, పూజా విధానాల్లో మార్పులు, ప్రసాదాల నాణ్యత లేమి వంటి అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం ఆలయాలపై ఆచరణాత్మక మార్పులు చేసిందన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
రథాన్ని తగులబెట్టడం, స్వామివారి పూజా విధానాలను మార్చడం వంటి చర్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇక శ్రీవాణి ట్రస్టు పేరుతో హుండీ ద్వారా వసూలు చేసిన డబ్బులకు సరైన రసీదులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మహాప్రసాదమైన తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేయడంపై ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని, ఇది భక్తుల విశ్వాసాలను అపవిత్రం చేయడమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ తప్పులను ఎలా సమర్థిస్తుందో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. ఈ వ్యవహారంలో దోషులకు కఠినమైన శిక్ష పడాలని, ఈ అంశంపై కేబినెట్ భేటీ, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు