'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో పోలీసులు వెల్లడించారు. ఛార్జిషీట్‌లోని అంశాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. బ్రిజ్ భూషణ్‌పై నమోదైన ఆరు కేసుల్లో పోలీసులు 108మంది సాక్షులను విచారించారు. వారిలో 15మంది రెజ్లర్లు ఆరోపణలను ధృవీకరించారని ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు సింగ్‌పై 506, 354, 354ఏ, 354డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలను ధృవీకరించడానికి సింగ్, రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలతో సహా సాక్షులకు సమన్లు ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.