మైనింగ్ స్కామ్ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు
బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.5 కోట్ల నగదు, రూ.11 కోట్ల ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాట్నలోని బ్రాడ్‌సన్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య మల్టీకామ్ ప్రైవేట్ లిమిటెడ్, వాటి డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ధన్‌బాద్, హజారీబాగ్ (జార్ఖండ్), కోల్‌కతాలో కూడా దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. రూ.6కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను సీజ్ చేసిన అధికారులు 60బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
బిహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు
మైనింగ్ కంపెనీలు, వాటి డైరెక్టర్లపై బిహార్ పోలీసులు నమోదు చేసిన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. బ్రాడ్‌సన్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య మల్టీకామ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై బిహార్ మైనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అక్రమ ఇసుక మైనింగ్, డిపార్ట్‌మెంటల్ ప్రీ-పెయిడ్ ట్రాన్స్‌పోర్టేషన్, ఈ-చలాన్‌ను ఉపయోగించకుండా విక్రయించడంపై ఆయా కంపెనీలు బిహార్ మైనింగ్ అథారిటీ ప్రభుత్వ ఖజానాకు రూ.250 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని కలిగించారన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేపడుతోంది.