Sai S. Jadhav : 93 ఏళ్ల ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్.. ఆమె ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మక ఘటనం చోటు చేసుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ (I.M.A.) నుంచి మొట్టమొదటిసారిగా మహిళా అధికారి శిక్షణను పూర్తి చేసి భారత సైన్యంలో అడుగు పెట్టారు. 93 ఐఎంఏ సంవత్సరాల చరిత్రలో మహిళా ఆఫీసర్ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సమాజంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విశేష ఘనతను సాధించిన మహిళ మహారాష్ట్రకు చెందిన సాయి ఎస్. జాధవ్. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆరు నెలల కఠిన సైనిక శిక్షణను పూర్తి చేసి భారత సైన్యంలో చేరారు. సాయి కుటుంబ సభ్యులు కూడా ఆర్మీలో సేవలందించినవారు కావడం గమనార్హం.
Details
బ్రిటిష్ సైన్యంలో సేవలు అందించిన సాయి ముత్తాత
ఆమె తాతయ్య భారత సైన్యంలో పని చేశారు, మరియు తండ్రి సందీప్ జాధవ్ కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సాయి ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలు అందించినట్లు సమాచారం. ఈ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయి ఐఎంఏలో చేరి సైనిక అధికారిణిగా మారడం సర్వత్రా పొగడ్తలు పొందుతోంది. ఇంతకుముందు ఐఎంఏలో శిక్షణ పొందిన క్యాడెట్స్ మొత్తం పురుషులే కావడంతో వారిని 'జెంటిల్‌మన్ క్యాడెట్స్' అని పిలిచేవారు. సాయి జాధవ్ ఈ ఘనత సాధించడంతో ఆమెను ఆఫీసర్ క్యాడెట్స్ అని పిలవనున్నారు. ఐఎంఏలో నిర్వహించిన పిప్పింగ్ వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి యూనిఫామ్‌పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్ చేసి, ఆమెకు ఆర్మీ అధికారిణిగా ర్యాంకింగ్‌ను కేటాయించారు.
Details
తల్లిదండ్రుల హర్షం
ఈ అరుదైన ఘనతపై సాయి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పాసై టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్‌గా చేరిన మొదటి మహిళగా తమ కూతురు మారినందుకు వారు గర్వం వ్యక్తం చేశారు. మరోవైపు 2026 జూన్‌లో డెహ్రాడూన్‌లో ఐఎంఏలో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి మహిళలతో కూడిన ఐఎంఏ తొలి ప్రత్యేక బ్యాచ్‌గా నిర్వహించనుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ 1932 డిసెంబర్ 10న ప్రారంభించబడింది. ఇప్పటివరకు దాదాపు 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్స్‌కు ఐఎంఏలో శిక్షణ ఇచ్చారు. సాయి జాధవ్ ఈ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.