Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడానికి ప్రభుత్వం బిల్లులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్‌లను ఎంపిక చేసేందుకు ప్రధాని, సుప్రీంకోర్టు సీజేఐ, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని మార్చిలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకుంటే అతిపెద్ద పార్టీ ప్రతినిధి ఈ కమిటీలో ఉండవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఎన్నికల కమిషనర్
కమిటీ నుంచి సీజేఐని తప్పించిన కేంద్రం
ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం సుప్రీంకోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్రం ఈ బిల్లును రూపొందించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి కేంద్రమంత్రిని నియమించనున్నట్లు కేంద్రం బిల్లులో పేర్కొంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల హోదాను ఎత్తివేసే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటికీ.. విపక్షాల అభ్యంతరాల మధ్య కమిషనర్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల హోదాను కొనసాగించాలని నిర్ణయించారు.