ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. ఎన్నికల ఏడాది కూడా కావడంతో రాష్ట్రం ప్రభుత్వం దశాబ్ది వేడుకలను చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను తయారు చేసింది.
10రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదిరోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దశాబ్ది ఉత్సవాలను సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నాయి. ఆయన పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లనున్నారు. తెలంగాణ వస్తే ఏం జరిగింది? ఈ పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతి, జరిగిన మార్పును గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కళారూపాల ద్వారా తెలియజేయనున్నారు. రైతు బంధు, దళిత బంధు, కాళేశ్వరం, విద్యుత్, ప్రాజెక్టులు, పరిశ్రమలు, నియామకాలు, మౌలిక సదుపాయాలు, తదితర అంశాల్లో రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి సాధించో ప్రజలకు వివరించనున్నారు.