తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన కొత్తపేట, భువనగిరి, హైదరాబాద్‌లోని గ్రీన్‌హిల్స్ కాలనీ కార్యాలయాలు సహా మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి భార్య వనిత ఈ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
70 బృందాలతో ఏకకాలంలో దాడులు
నగరంలోని గచ్చిబౌలిలో ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై అధికారులు దాడులు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 70 బృందాలతో ఐటీ అధికారులు బీఆర్ఎస్ నేత ఇళ్లలో ఒకే సమయంలో సోదాలను చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు బీఆర్ఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఐటీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించడం గమనార్హం.