Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమవుతోంది : నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉండవల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం కారణంగానే పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని నారా లోకేష్ చెప్పారు. అనకాపల్లిలో అర్సెల్లార్ మిత్తల్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
Details
దేశంలో ఏపీ ప్రథమ స్థానం
విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇది దేశ ఎఫ్‌డీఐ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తుంది. నెల్లూరులో బీపీసీఎల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఎన్టీపీసీ రూ.1.60 లక్షల కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. 'స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో మనం పోటీపడి ముందుకు సాగుతున్నామన్నారు. అనుభవం, సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అర్సెల్లార్ మిత్తల్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు రెండు సార్లు కలిశారు.
Details
300 మంది ఇన్వెస్టర్లు హాజరయ్యే అవకాశం
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు, దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. 45 దేశాల నుంచి సుమారు 300 మంది ఇన్వెస్టర్లు హాజరవుతున్నారు. మొత్తం 410 ఒప్పందాలు కుదరనున్నాయని వివరించారు. ఇన్వెస్టర్లు, ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టగలం. ఇప్పటి వరకు 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాం. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా పెద్ద స్థాయిలో పెట్టుబడులు సాధించాలని లోకేశ్ స్పష్టం చేశారు.