Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్.. ఎంపీల వినతికి స్పీకర్ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ప్రత్యేకంగా పండించే అరకు కాఫీని పార్లమెంట్‌లో ఎంపీలకు అందుబాటులోకి తేవడానికి తొలి అడుగుగా,సమావేశాల సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు.
ఈమేరకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీ సీఎం రమేష్ మంగళవారం స్పీకర్‌ను కలిసి వినతి చేశారు.
వివరాలు
శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం
''అరకు కాఫీ ప్రత్యేక రుచిని పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేయడానికి, దీని ప్రచారానికి ప్రత్యేక అనుమతి ఇవ్వండి. ప్రధానమంత్రి మోదీ 'మన్ కీ బాత్'లో కూడా అరకు కాఫీని అనేకసార్లు ప్రస్తావించడం వల్ల దాని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పుడు పార్లమెంటులో స్టాల్ ఏర్పాటుకు అనుమతిస్తే, ఎంపీలు, ఇతర ప్రముఖులు దీని రుచిని ఆస్వాదించగలరు. మొదటిగా ఈ సమావేశాల్లో స్టాల్‌కు అనుమతి ఇచ్చి, ఆపై శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించండి. ఈ చర్య గిరిజన రైతులకు దీర్ఘకాల మార్కెట్ అవకాశాలను అందిస్తుంది'' అని వారు విజ్ఞప్తి చేశారు.
స్పీకర్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా స్వీకరించి, ప్రస్తుత సమావేశాల్లో స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారని లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు తెలిపారు.