Delhi Blast: ఎర్రకోట పేలుడు మిస్టరీ వీడుతోంది.. 3 గంటలపాటు పార్కింగ్‌లో కూర్చున్న సూసైడ్ బాంబర్ ఇతడేనా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో తీవ్ర హైటెన్షన్ పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఒక్క ఢిల్లీనే కాదు, దేశమంతా షాక్‌కు గురిచేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో వ్యక్తులు గాయపడ్డారు. గాయపడినవారిని LNJP ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 6:52 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. స్పాట్‌లో ఉన్నవారికి మొదట ఏమి జరిగిందో అర్థం కాలేదు కానీ, క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించి ఆ ప్రాంతం మొత్తం వణికిపోయింది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Details
కారు యజమానిని అరెస్టు చేసిన పోలీసులు
పేలుడు చోటుచేసుకున్న కారు హర్యానాలో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. కారు యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ వాహనం చివరి యజమాని పుల్వామా వాసి తారిక్ అని గుర్తించారు. ఘటన స్థలానికి NSG కమాండోలు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఉగ్రవాద ఆత్మహుతి దాడి కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారులో నుంచి శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కి పంపింది.
Details
బదర్‌పూర్ సరిహద్దు దాటుతున్న దృశ్యాలు
HR 26CE7674 నంబర్ ప్లేట్ కలిగిన వైట్ ఐ20 కారు మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి ప్రవేశించి, సాయంత్రం 6:30 వరకు అక్కడే నిలిచినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. బదర్‌పూర్ సరిహద్దు దాటుతున్న దృశ్యాలు కూడా దొరికాయి. డ్రైవర్‌గా ఉన్న అనుమానితుడు నీలం-నలుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నట్లు చెబుతున్నారు. కారు పార్క్ చేసిన తర్వాత అతను కిందకు దిగకుండా ఎవరికోసమో ఎదురు చూసినట్లు అధికారులు భావిస్తున్నారు. కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఆత్మహుతి బాంబర్ అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా పరిగణించి ఢిల్లీ పోలీసులు UAPA (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేశారు.
Details
అన్ని కోణాల్లో దర్యాప్తు
దీనితో ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీ సమీప హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్యుడి ఆధీనంలో ఉన్న ఐ20 కారు ఈ పేలుడుకు కారణమవడం వల్ల "వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్" లింక్ బయటపడినట్లు సమాచారం. దర్యాప్తు ఏజెన్సీలు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.