Arvind Panagariya: 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగాఢియా నియామకం
16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగాఢియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్ పనగాఢియాను చైర్మన్‌గా నియమించడం ద్వారా ఆర్థిక సంఘం బలోపేతం అవుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. పనగఢియా నలంద విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పని చేశారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌కు చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన అనుభవం అయనకు ఉంది. వరల్డ్ బ్యాంకు వంటి ప్రపంచస్థాయి సంస్థల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
16వ ఫైనాన్స్ కమిషన్ కమిషన్ తన ఐదేళ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31 వరకు) తన ఆర్థిక నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కోసం ఆర్థిక సంఘం ఏర్పాట్లను సమీక్షిస్తుంది. అలాగే కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. ఇది కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఇది నిర్దేశిస్తుంది. 15వ ఆర్థిక సంఘానికి ఎన్‌కే సింగ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.