కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి. చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. మరో వేవ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను రెండు వారాలుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తోంది. బుధవారం చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడంతో.. రాష్ట్రాలను మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది.
మూడు రోజుల్లో 39 మందికి..
అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తులు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. గత మూడు రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 1,780 నమూనాలను సేకరించగా..అందులో 39 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ కేసుల నమూనాలన్నింటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు చెప్పారు. దేశంలో ఎలాంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఇప్పటికే మాక్ డ్రిల్స్‌ను కూడా నిర్వహించారు. దేశంలో 24 గంటల్లో 188 కొత్త కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఉన్న పండగ సీజన్‌ను దృష్టి పెట్టుకొని.. మరో 40రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.