టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది. జూన్ రెండో వారంలో బెంగళూరులో టమాటా ధర కిలో రూ. 25 ఉండేది. గత వారం అది రూ. 60కి పెరిగింది. ఈ వారం ఏకంగా కిలో టమాట 120 పలుకుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మే నెలలో టమాట కిలో రూ.3నుంచి రూ.5వరకు అమ్మారు. దీంతో రవాణా ఖర్చులకు కూడా రాకపోవడంతో రైతులు టమాట పంటను రోడ్డున పడేసిన సంఘటనలు మనకు కనిపించాయి. ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో టమాట ధరలు కిలోకు 150 రూపాయలకు చేరుకోవచ్చని కాన్పూర్‌లోని ఓ వ్యాపారి జోస్యం చెప్పాడు.
వేడిగాలులు, భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి
ఈ ఏడాది ప్రారంభంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు టమాట పంటను వదిలేశారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. టమాటా పండించే ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షం కారణంగా దిగుబడి తగ్గిపోవడమే కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ముంబయికి చెందిన కమోడిటీ మార్కెట్ నిపుణుడు, కేడియా అడ్వైజరీ హెడ్ అజయ్ కేడియా మాట్లాడుతూ, ఈ సంవత్సరం వివిధ కారణాల వల్ల గతేడాది కంటే తక్కువ టమోటాలను నాటినట్లు చెప్పారు. గత సంవత్సరం బీన్స్ ధర పెరగడంతో, చాలామంది రైతులు ఆ సాగుకు మొగ్గు చూపారు. రుతుపవనాల ఆలస్యం పంటలు ఎండిపోవడానికి కారణమైనట్లు చెప్పారు. అలాగే భారీ వర్షపాతం, విపరీతమైన వేడి కారణంగా టమాట పంట నష్టం జరిగనట్లు వెల్లడించారు.