Loading...
PM Modi: ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి
ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి

PM Modi: ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో కేసు ఎదుర్కొంటున్న బాలిక వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ప్రధానికి క్షమాపణలు చెప్పిన ఆ బాలికకు సంబంధించి తాజాగా ఆమె తల్లి స్పందిస్తూ, తమ కుమార్తెను క్షమించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ క్షమించడంతో నా కుమార్తెకు కొత్త జీవితం లభించింది. ఆమె అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించినప్పటికీ వాటిని పెద్ద మనసుతో క్షమించారు. ఇవాళ నా కుమార్తె పుట్టినరోజు. ఈ రోజున ఆమెకు ప్రధాని అందించిన అత్యంత గొప్ప కానుక కొత్త జీవితమే. ఇది ఆమెకు పునర్జన్మ లాంటిదేనని బాలిక తల్లి పేర్కొన్నారు.

వివరాలు

కేసును కొట్టివేయాలి

అదే సమయంలో మైనర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మైనర్లు సోషల్ మీడియాను వినియోగించకుండా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిబంధనలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

ఇక తన కుమార్తెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆమె వయసును 25 సంవత్సరాలుగా నమోదు చేశారని, కానీ వాస్తవానికి ఆమెకు 15 ఏళ్లే అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమెపై నమోదైన కేసును కొట్టివేయాలని ప్రధానిని కోరారు.

తప్పు తెలుసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ, తన కుమార్తెకు ఇప్పటికీ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, ఈ అంశంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వివరాలు

తన తప్పును గుర్తించింది

మరోవైపు ఆ బాలిక కూడా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు తెలిపింది.

నిరసనల సమయంలో కొందరి ప్రభావానికి లోనై ప్రధానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని, తన తప్పును గుర్తించి పశ్చాత్తాపపడుతున్నానని వెల్లడించింది.

ADVERTISEMENT