Loading...
PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ
'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ

PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థుల నిరసనలు, అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. జంతర్‌మంతర్‌లో నిరసన సందర్భంగా తనను తీవ్రంగా విమర్శించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. 'హమారే బచ్చే హై (వాళ్లంతా మన పిల్లలు)' అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. యువతలో కొందరు దారి తప్పారని, వారికి అవసరమైంది శిక్షలు కాదని, సరైన మార్గదర్శకత్వమని స్పష్టం చేశారు. 'జంతర్‌మంతర్‌లో జరిగిన ఘటనలను దేశమంతా, ప్రపంచమంతా చూసింది. కొంతమంది యువకులు, విద్యార్థులు సభ్య సమాజానికి తగని భాషలో మాట్లాడారు. నన్ను మాత్రమే కాదు, దివంగతురాలైన నా తల్లిని కూడా దూషించారు. వారు ఉపయోగించిన పదజాలం ఎంత అసభ్యకరమో చెప్పలేను.

వివరాలు

సమస్యలకు పరిష్కారం వెతకాలి

ముఖ్యంగా మన ఆడబిడ్డలు కూడా ఇలాంటి భాష ఉపయోగించడం సాంస్కృతికంగా ఎంతో బాధాకరమని ప్రధాని వ్యాఖ్యానించారు.

యవ్వనంలో ఇలాంటి తప్పిదాలు జరగడం సహజమేనని, పసితనంలో కొందరు భావోద్వేగాలకు లోనవుతారని మోదీ అన్నారు. అందుకే సమాజంలో నెలకొన్న ఆందోళన, ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని తెలిపారు.

ఈ పిల్లలను దూరం చేయాల్సిన అవసరం లేదు. వారిని అక్కున చేర్చుకుని సరైన దారి చూపించాల్సిన సమయం ఇది.

వీరంతా తోవ తప్పిన పిల్లలు. వారికి మార్గనిర్దేశం చేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదని ప్రధాని అభిప్రాయపడ్డారు.

అలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను సరిదిద్దడమే ముఖ్యమని అన్నారు.

వివరాలు

సరైన మార్గంలో నడిపించాలి

''నేను వారిని క్షమిస్తున్నాను. సమాజం కూడా నా ఈ విజ్ఞప్తిని గౌరవించి వారిని క్షమించాలని కోరుతున్నాను'' అని మోదీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు.

కొన్నిసార్లు పళ్ల మధ్య నాలుక చిక్కుకుని రక్తం కారుతుంది. అయినా పళ్లూ మనవే, నాలుకా మనదే. అలాగే ఈ పిల్లలు కూడా మనవాళ్లే. వారిని శిక్షించడం కాదు, సరైన మార్గంలో నడిపించడం మన కర్తవ్యమని వివరించారు.

దేశం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని, ఆ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఆకాంక్షించారు.

దూషణలతో సమస్యలు పరిష్కారం కావు. నేను మీ కోసమే జీవిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్నానంటూ తన వీడియో సందేశాన్ని ముగించారు.

ADVERTISEMENT