Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కార్మికులు బయటకు వస్తారు అనుకుంటే.. మరో ఎదురుదెబ్బ తగిలింది. సొరంగానికి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ విరిగిపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ మరోసారి నిలిచిపోయింది. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. క్రిస్మస్ నాటికి కార్మికులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.
ఆగర్ యంత్రం బ్లేడ్ ఎలా విరిగింది?
కొన్ని రోజులుగా హెవీ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ చేస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో కొన్నిసార్లు ఇనుప కడ్డీలు అడ్డువచ్చాయి. ఈ క్రమంలో మిషన్ బ్లేడ్‌కు మరమ్మతులు ఏర్పడి.. చాలా సార్లు డ్రిల్లింగ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత యంత్రాన్ని మరమ్మతు చేసి మళ్లీ, డ్రిల్లింగ్ చేసిన సందర్భంగా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా డ్రిల్లింగ్ యంత్రం బ్లేడ్ ఇనుప రాడ్లలో ఇరుక్కుని పైపులో విరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఇరుక్కుపోయిన యంత్రాన్ని బయటకు తీస్తున్నారు. ఇదిలా ఉంటే, రెస్క్యూ ఆపరేషన్‌పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సొరంగం నుంచి కార్మికులను తరలించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
మాన్యువల్ డ్రిల్లింగ్ ఎంత సమయం పడుతుంది?
రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మరో 10మీటర్లు మాత్రమే డ్రిల్లింగ్ మిగిలి ఉంది. దీంతో కార్మికులను రక్షించడానికి మాన్యువల్ డ్రిల్లింగ్ పద్ధతిని అధికారులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, మెషిన్ డ్రిల్లింగ్‌తో పోలిస్తే మాన్యువల్ డ్రిల్లింగ్‌కు అదనంగా 18-24 గంటల సమయం పట్టవచ్చు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ అంటున్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్ ఆదివారం ప్రారంభం అవుతుందని అధికారులు అంటున్నారు. ఆగర్ మిషన్ రోటరీ బ్లేడ్‌లను తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో రప్పిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు. సొరంగం ప్రవేశద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. కార్మికులను చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.