The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే..
'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక సీనియర్ పోలీసు అధికారి, ఓ జవాన్ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలు 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' ఉగ్రవాద సంస్థ చరిత్ర ఏంటి? దీని వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
అతి తక్కువ కాలంలోనే ఉగ్ర దాడుల పరంపరం
2019లో కశ్మీర్‌లో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. అతి తక్కువ కాలంలోనే ఈ ఉగ్రవాద సంస్థ పదుల సంఖ్యలో ఉగ్రదాడులకు పాల్పడింది. ముఖ్యంగా లోయలో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది టీఆర్ఎఫ్‌ను భారత్ నిషేధించబడింది. యూఏపీఏ చట్టం నాలుగో షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎఫ్ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన గుల్ జూన్ 2018లో కశ్మీరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు సైన్యం అనుమానిస్తోంది.
పాకిస్థాన్ అండతో రెచ్చిపోతున్న 'టీఆర్ఎఫ్'
టీఆర్ఎఫ్ సంస్థ నిజానికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని భారత ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం అండతోనే లష్కరే తోయిబా ఎదిగింది. ఇప్పుడు లష్కరే తోయిబాకు చెందిన టీఆర్‌ఎఫ్‌కి కూడా పాక్ యంత్రాంగం నుంచి అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' కశ్మీర్‌లో లోయలో భద్రతా దళాల సిబ్బంది, అమాయక పౌరుల హత్యలను ప్లాన్ చేయడం ద్వారా విధ్వంసం సృష్టిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, దేశవ్యాప్తంగా ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' కీలక పాత్ర పోషిస్తోంది.
'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను ఎందుకు సృష్టించారు?
పాకిస్థాన్‌కు ఉగ్రవాదులను పెంచి, పోషిస్తుందన్న పేరు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో తీవ్రవాదులకు నిధులు సమకూర్చడంపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నుంచి పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. టెర్రరిస్టులకు నిధులు అందజేస్తుందన్న అభియోగాల నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ 'గ్రే లిస్ట్'లో చేర్చింది. లష్కరే తోయిబా, దాని చీఫ్ హఫీజ్ సయీద్‌కు సహాయం చేయడాన్ని ఎఫ్ఏటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద సంస్థగా ముద్రపడ్డ లష్కరే తోయిబా, దాని చీఫ్ హఫీజ్ సయీద్‌కు సాయం చేయొద్దని ప్రపంచ దేశాల నుంచి పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తడి ఉంది. ఈ క్రమంలోనే లష్కరే తోయిబాకు 'బీ' టీమ్‌గా 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను పాకిస్థాన్ సృష్టించింది.
కశ్మీర్ లోయలో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'లోకి భారీగా చేరికలు
కశ్మీర్‌లో ఇటీవల జరిగిన చాలా దాడుల వెనుక 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' హస్తం ఉంది. 2022లో కశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన 90కి పైగా ఆపరేషన్‌లలో 42 మంది విదేశీయులతో సహా 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది (108) 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' లేదా లష్కరే తోయిబాకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే టెర్రరిస్టు గ్రూపుల్లో చేరుతున్న ప్రతి100 మందిలో 74 మందిని టీఆర్‌ఎఫ్ రిక్రూట్ చేసుకుంటోంది. దీన్ని బట్టి ఆ సంస్థ కశ్మీర్‌లో ఎలాంటి సవాల్‌ను విసురుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థల్లో ఇది అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.