Viral Fevers: తెలంగాణలో విష జ్వరాల ఉద్ధృతి.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు పేషెంట్లతో నిండిపోయాయి. ప్రభుత్వాస్పత్రిలో బెడ్స్ దొరకడం కష్టంగా మారింది. ఒకే మంచంపై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 5,372 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా 1,852 కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయి.
వేధిస్తున్న మందుల కొరత
సూర్యాపేటలో 471, మేడ్చల్‌లో 426, ఖమ్మంలో 375, నల్గొండలో 315 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 350కి పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఎనిమిది వేలకు పైగా జ్వరపీడితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా జ్వరపీడితులు అధికంగా కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు నుండి మెడికల్ కాలేజీల వరకు మందుల కొరత వేధిస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి ఆస్పత్రులకు మందుల సరఫరా నిలిపివేయడంతో ఈ సమస్య తీవ్రతరమైంది. సప్లయర్లు, డీలర్లకు పెండింగ్ బిల్లులు ఉండటం కారణంగా మందుల కొరత ఏర్పడినట్లు తెలిసింది. విషజ్వరాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేసింది.
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : సీఎం
ప్రభుత్వం డెంగ్యూ మరణాల వివరాలను దాచిపెడుతోందని ఆ పార్టీ ఆరోపణలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసి, వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఉధృతి భయంకరంగా మారింది. ప్రభుత్వం చర్యలు తక్షణమే తీసుకోకపోతే ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.