Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన నెల తర్వాత ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందూ దేవాలయాలను కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్ ఆరోపించారు. అందుకే షాహీ ఈద్గా మసీదుపై హిందూ సమాజానికి హక్కు ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద భూమికి సంబంధించి కృష్ణ జన్మభూమి ట్రస్ట్, మసీదు కమిటీ ఇచ్చిన వాంగ్మూలాల్లో విశ్వసనీయతను నిర్ధారించడానికి క్షుణ్ణంగా శాస్త్రీయ సర్వే నిర్వహించడం తప్పనిసరి అని పిటిషనర్ పేర్కొన్నారు.